ఆర్మీలో మహిళా కమాండర్ల పాత్రపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు నిచ్చింది. ఆర్మీలో మహిళలు కమాండర్ బాధ్యతలు నిర్వహించవచ్చునని తీర్పు నిచ్చింది. లింగ ఆధారంగా కేంద్రం చేసిన వాదనలపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం వాదన ”కలచివేసేదిగా..వివక్షాపూరితమైనదిగా” కోర్టు పేర్కొంది. కేంద్రం ”ఆలోచనా విధానాన్ని” మార్చుకోవాలని జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం కోరింది. రిపబ్లిక్ డే లో మగ జవాన్ లకు నాయకత్వం వహించిన కెప్టెన్ తనియా షెర్గిల్ (26) ను ఉదాహరణగా చూపింది. ఆర్మీలోకి వుమెన్ ఆఫీసర్స్ ను తీసుకోవడం ఒక పరిణామ ప్రక్రియ. వాళ్ల భౌతిక లక్షణాలకు హక్కులకు సంబంధం లేదు. మహిళలు మగ సహోద్యోగులకు దూరంగా ఉండాల్సిన పని లేదు. మగ వాళ్లతో కలిసి మెలిసి పనిచేయాలని పేర్కొంది.
ఆర్మీలో మహిళలను ఆఫీసర్లుగా నియమించకపోవడంపై దాఖలైన పిటషన్ పై విచారించిన సుప్రీంకోర్టు..ఆర్మీలో మహిళలు కూడా కమాండర్ల పాత్ర పోషించవచ్చని తీర్పు నిచ్చింది. కేవలం యుద్ధాలకే కాదు అని స్పష్టం చేసింది. మూడు నెలల్లో ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు ఆర్మీలో 14 సంవత్సరాలకు తక్కువ గాకుండా షార్ట్ సర్వీస్ కమిషన్ సేవలందించిన మహిళలు ఇప్పుడు పర్మినెంట్ కమిషన్ కు మారడానికి కోర్టు అవకాశం కల్పించింది. ఆర్మీలో కొన్ని దశాబ్ధాలుగా ఉన్న లింగ వివక్షకు కోర్టు చరమ గీతం పాడింది. ఆర్మీలో మహిళలు, పురుషు లంటూ వివక్ష చూపరాదని కోర్టు పేర్కొంది. కేవలం మహిళలు అనే కారణంతో వారిని ఆఫీసర్ల పోస్టుకు ఎంపిక చేయకుండా అడ్డుకోవడం వారి సమానత్వ హక్కుకు వ్యతిరేకమని కోర్టు తెలిపింది.కోర్టు తీర్పుతో ఆర్మీలో ఇప్పటి వరకు కల్నల్ గా ఉన్న మహిళలు ఇప్పుడు బెటాలియన్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహించవచ్చు.
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో మహిళలు ఆర్మీ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వహించడానికి మానసికంగా సిద్ధంగా లేరని కేంద్రం వాదించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ధర్మాసనం…మహిళలు భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు..ఈ లింగ వివక్షను…మూస పద్దతిని విడనాడాలి అని ధర్మాసనం పేర్కొంది.