పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం అత్యున్నత జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని సూచించింది. అయితే ఇందుకయ్యే మొత్తం ఖర్చులు అంబానీయే భరించాలని స్పష్టం చేసింది.
జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లాతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిస్తూ ఇండియాలో ..దేశవ్యాప్తంగా ఈ భద్రత ఆయనకు ఉంటుందని, దీని బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వానిది కాగా విదేశాల్లో సెక్యూరిటీ బాధ్యత కేంద్ర హోమ్ శాఖ చేబట్టాలని పేర్కొంది. భద్రతా పరమైన ముప్పు ఉన్నప్పుడు సెక్యూరిటీ కవర్ అన్నది కేవలం ఒక ప్రత్యేక ప్రాంతానికి మాత్రమే పరిమితం కారాదని కూడా న్యాయమూర్తులు వివరించారు.
దేశంలోనూ, విదేశాల్లోనూ అంబానీ వ్యాపార సంబంధ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్నాయని, అందువల్ల భద్రతను ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం చేయడం సబబు కాదని వారు అభిప్రాయపడ్డారు. అంబానీ భద్రత అనేక చోట్ల వివాదాంశాలుగా మారిందని, వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయని కోర్టు పేర్కొంది.
ముంబైలో అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం సెక్యూరిటీని కొనసాగించాలంటూ గత ఏడాది జులై 22 న సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, దీనిపై స్పష్టత కావాలని కోరుతూ త్రిపురకు చెందిన బికాష్ సాహా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఈయన వేసిన ‘పిల్’ పై త్రిపుర హైకోర్టు మే 31 న, జూన్ 21 న రెండు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీల్ ను కోర్టు అనుమతించింది.