లఖీంపూర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆశిశ్ మిశ్రా బెయిల్ ను రద్దు చేయాలని యూపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నియమించిన కమిటీ రిటైర్డ్ జడ్జి సిఫారసు చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయాలంటూ రిటైర్ట్ న్యాయమూర్తి సిఫారసులు చేశారు.
ఈ సిఫారసులపై ఏప్రిల్ 4 లోగా స్పందించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి యూపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తు్న్న సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలాని బదులిచ్చారు. ఈ విషయంలో తమకు ఎలాంటి లేఖలు ఇప్పటి వరకు అందలేదని హోం శాఖ అదనపు కార్యదర్శి తమకు తెలిపారని కోర్టుకు విన్నవించారు.
దీంతో రిటైర్డ్ జడ్డి ఇచ్చిన నివేదిక కాపీలను న్యాయవాది మహేశ్ జఠ్మలానికి అందించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. దానితో పాటు మరో కాపీని పిటిషనర్లకు కూడా అందించాలని రిజిస్ట్రార్ ను ఆదేశించింది. కేసు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని మహేశ్ జఠ్మలాని కోరారు. దానికి అంగీకరించిన కోర్టు.. ఈ కేసులో ఇప్పటికే నెల రోజులకు పైగా జాప్యం జరిగిందని వ్యాఖ్యానించింది.
గతేడాది అక్టోబర్ 3న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనల సమయంలో రైతులపైకి కారు దూసుకు వచ్చింది. ఈ ఘటనలో 8 మంది రైతులు మరణించారు. ఈ ఘటనకు ప్రధాన కారకులు ఆశిశ్ మిశ్రా అని ఆరోపణలు వచ్చాయి. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10న బెయిల్ ను అలహాబాద్ కోర్టు మంజూరు చేసింది. దీంతో ఆయన బెయల్ ను రద్దు చేయాలంటూ మరో పిటిషన్ దాఖలైంది.