ఇండియాలో బీబీసీ ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూసేన వేసిన ఈ పిటిషన్ ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం. సుందరేశ్ తో కూడిన బెంచ్ తిరస్కరించింది. తాము ఇలాంటి సెన్సార్ షిప్ ను విధించలేమని, ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే పిటిషన్ అని అసహనం వ్యక్తం చేసింది. ‘ఇండియా, ది మోడీ క్వశ్చన్’ పేరిట బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ కొంతకాలంగా వివాదంలో పడింది. 2002 ప్రాంతంలో గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా నాడు జరిగిన అల్లర్లను ఈ డాక్యుమెంటరీ హైలైట్ చేసింది.
అయితే ఇది భారత ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా ఉందంటూ కేంద్రం దీనిపై బ్యాన్ విధించింది సోషల్ మీడియాలో కూడా ఎక్కడా దీని తాలూకు వీడియో క్లిప్ లు కనిపించకుండా సెన్సార్ విధించింది. కానీ అసలు దేశంలో బీబీసీ ఛానల్ నే నిషేధించాలని హిందూ సేన తన పిటిషన్ లో కోరింది. కేంద్రం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ ని కోర్టు ఇటీవలే విచారించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని , మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఏప్రిల్ కి విచారణను కోర్టు వాయిదా వేసింది.
మొదట పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ లాయర్ పింకీ ఆనంద్.. బీబీసీ కావాలనే భారత ప్రతిష్టను దెబ్బ తీస్తోందని ఆరోపించారు. ఈ డాక్యుమెంటరీ వెనుక జరిగిన కుట్రపై ఇన్వెస్టిగేషన్ జరపాలని కూడా ఆయన కోరారు.
అయితే ఈ పిటిషన్ లో మెరిట్ లేదని, ఇక సమయాన్ని వృధా చేయరాదని, దీన్ని కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ డాక్యుమెంటరీ నిషేధాన్ని సవాలు చేస్తూ ప్రముఖ జర్నలిస్ట్ ఎన్. రామ్, సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ తదితరులు పిటిషన్లు వేశారు.