ఈ నెల 28 న కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించేలా లోక్ సభ సెక్రటేరియట్ కు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన ‘పిల్’ ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టుకే చెందిన సిఆర్. జయ సుకిన్ అనే లాయర్ వేసిన ఈ పిటిషన్ విచారణార్హం కాదని జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్.నరసింహాతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లతో మీరెందుకు వస్తారని, 32 వ అధికరణం కింద ఈ విధమైన వాటిని విచారించడం పట్ల తమకు ఆసక్తి లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
మీకు కోర్టు ఖర్చులు వెయ్యకుండా సరిపుచ్చుతున్నాం చూసుకోండి అని బెంచ్ పేర్కొంది. భారత రాజ్యాంగంలోని 79 ఆర్టికల్ కింద రాష్ట్రపతి .. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలి గానీ ప్రధాని కాదన్న పిటిషనర్ వాదనతో జస్టిస్ మహేశ్వరి విభేదిస్తూ.. ఈ అధికరణానికి, ప్రారంభోత్సవానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
అయితే పిటిషనర్ జయ సుకిన్ మరింతగా వాదించబోగా..న్యాయమూర్తులు అడ్డుకుని మీ వాదనతో తమను ఒప్పించలేరని, అందువల్ల మీ పిటిషన్ ను కొట్టివేస్తున్నామని పేర్కొన్నారు. దాంతో తన పిటిషన్ ఉపసంహరణకు అనుమతించాలని సుకిన్ కోరారు. కాగా-ఇందుకు పిటిషనర్ ని అనుమతించరాదని, ఈయన ఇదే పిటిషన్ ను హైకోర్టులో కూడా దాఖలు చేస్తారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కానీ హైకోర్టుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని, తన పిల్ ని ఉపసంహరించుకుంటున్నానని పిటిషనర్ చెప్పారు.
నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని, కానీ ఇందుకు విరుద్ధంగా.. ఏ మాత్రం ఆలోచించకుండా లోక్ సభ సచివాలయం నిరంకుశంగా స్టేట్మెంట్ జారీ చేసిందని సుకిన్ తన పిల్ లో పేర్కొన్నారు. రాష్ట్రపతికే విశేషాధికారాలు ఉన్నాయన్నారు. తన వాదనకు అనుగుణంగా ఆ లాయర్ రాజ్యాంగంలోని కొన్ని అధికరణాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈయన వాదనతో సుప్రీంకోర్టు పూర్తిగా విభేదించింది.