మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఫడణవీస్ తనకు మెజార్టీ ఉందని గవర్నర్ కు ఇచ్చిన లేఖను కోర్టుకు సమర్పించాల్సిందిగా సొలిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.
గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడంపై శివసేన-ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు శనివారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేశాయి. ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు దినం అయినప్పటికీ ఈ పిటిషన్లపై ఈరోజు జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది. శివసేన-ఎన్సీపీ ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ , మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్, కాంగ్రెస్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా…ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గీ, సొలిషిటర్ జనరల్ తుషార్ మెహతాలు హాజరయ్యారు. గవర్నర్ చర్య వినూత్నంగా ఉందని..మెజార్టీ లేకపోయినప్పటికీ ఫడణవీస్ చేత ప్రమాణ స్వీకారం చేయిండం రాజ్యాంగ విరుద్ధమని శివసేన, కాంగ్రెస్ తరపు న్యాయవాదులు వాదించారు. నిజంగా వారికి మెజార్టీ ఉంటే వెంటనే ప్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. గతంలో కర్ణాటకలో కూడా ఇదే జరిగిందని ఉదాహరించారు. మద్దతు నిచ్చే ఎమ్మెల్యేల చేత పరేడ్ నిర్వహించాలని కోరారు.
గవర్నర్ చర్య కోర్టు సమీక్ష పరిధిలోకి రాజాలదని..గవర్నర్ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏ చర్యనైనా తీసుకుంటారని ప్రభుత్వం తరపున సొలిషిటర్ జనరల్ వాదించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు తగిన మెజార్టీ ఉందని ఫడణవీస్ గవర్నర్ కు లేఖ ఇచ్చినందునే గవర్నర్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వివరించారు. దీంతో ఫడణవీస్ గవర్నర్ కు సమర్పించిన లేఖను సోమవారం పదిన్నర గంటలకు కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.