సుప్రీమ్ కోర్టులో పెండింగ్ లో ఉన్న తన కేసు విచారణని వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాని కోసం ఇప్పటి వరకు రెండు పిటిషన్లు దాఖలు చేశాడు.
వీటిపై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం రెండు పిటిషన్లలో ఉపయోగించిన పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జడ్జిని టెర్రరిస్టుతో పోలుస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు ఆలస్యం చేయడం వల్ల సదరు జడ్జికి వచ్చే ప్రయోజనమేంటి? న్యాయమూర్తి మీ రాష్ట్రానికి చెందినవాడైనందునే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అని సీజేఐ పిటిషనర్ను ప్రశ్నించారు. కొన్ని నెలలు జైలుకు పంపింతే అప్పుడు తెలిసొస్తుందని సదరు వ్యక్తిని హెచ్చరించారు.
జడ్జిని టెర్రరిస్టుతో పోల్చడాన్ని తీవ్రంగా పరిగణించిన సీజేఐ ధర్మాసనం సదరు పిటిషనర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది సదరు వ్యక్తికి బేషరతూ క్షమాపణ చెప్పాలని సూచించాడు. ఒకవేళ క్షమాపణ చెప్పని పక్షంలో తాను ఆ కేసు నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
దీంతో పిటిషనర్ కోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కరోనా కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నానని అందుకే అలాంటి పదాలు ఉపయోగించానని కోర్టుకు విన్నవించాడు. పిటిషనర్ క్షమాపణను రికార్డు చేసిన బెంచ్.. సదరు వ్యక్తి తన ప్రవర్తనకు కారణాలను ప్రస్తావిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మూడు వారాల గడువు ఇచ్చింది.