అజీమ్ హసన్ ప్రేమ్ జీ పై సుప్రీం కోర్టు ప్రశంసల వర్షం కురిపించింది. గతంలో ఆయనపై, ఆయన సహాయకులపై 70 పైగా వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిని క్షమించేందుకు అంగీకరించినందుకు ఆయనను సుప్రీం కోర్టు ప్రశంసించింది.
‘ ఈ విషయంలో అజీమ్ ప్రేమ్ జీ నిర్మాణాత్మక వైఖరిని అవలంభించారు. ఆర్ సుబ్రమణియన్ గత ప్రవర్తనను క్షమించేందుకు ప్రేమ్ జీ అంగీకరించడం మాకు సంతోషంగా ఉంది” అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం అని వ్యాఖ్యానించింది.
వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ఇరుపక్షాలు సిద్ధంగా ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని ప్రస్తుత కేసు తెలియజేస్తోందని ఈ సందర్బంగా ధర్మాసనం పేర్కొంది.
అజీమ్ ప్రేమ్ జీ, ఆయన భార్యపై ఇండియా అవేక్ అనే ఎన్జీవోకు చెందిన ఆర్ సుబ్రమణియన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ప్రేమ్ జీ ఏర్పాటు చేసిన హషామ్ సంస్థలో ప్రేమ్ జీ, అతని తల్లికి చెందిన మూడు సంస్థలను విలీనం చేశారని కోర్టుకు తెలిపారు.
ఈ సమయంలో పాత మూడు సంస్థల నుంచి కొత్త ట్రస్టులోకి అక్రమంగా భారీగా నిధులు మళ్లించారని అజీమ్ పై సుబ్రమణియన్ ఆరోపణలు చేశారు. దీనిపై ప్రేమ్ జీ, అతని భార్యకు కోర్టు సమన్లు జారీ చేసింది.
వీటిపై కర్ణాటక హైకోర్టును అజీమ్ ప్రేమ్ జీ ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు కొట్టి వేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కాగా ఆ తర్వాత ఆ కేసులను ఉపసంహరించుకుంటానని సుబ్రమణియన్ ముందుకు వచ్చాడు.
దీంతో బంతి అజీమ్ ప్రేమ్ జీ కోర్టులో పడింది. ఇన్ని కేసులు వేసిన వ్యక్తిని ఆయన క్షమిస్తారా లేదా పిటిషన్ పై న్యాయ పోరాటం చేస్తారా అనే సందేహం కలిగింది. కానీ అతన్ని క్షమించడానికి ప్రేమ్ జీ ముందుకు రావడంతో సుప్రీం కోర్టు ఆయన్ని ప్రశంసించింది.