మతమార్పిళ్ల విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మత మార్పిళ్లు అనేది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. దీనికి రాజకీయ రంగులు పులమకూడదంటూ వ్యాఖ్యలు చేసింది. మోసపూరిత మతమార్పిళ్లకు అడ్డుకట్ట వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలన్న పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
తమ రాష్ట్రంలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని తమిళనాడు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇదంతా కేవలం రాజకీయ కక్షసాధింపుచర్యలేనని ఆయన అన్నారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీ వ్యాఖ్యల వెనుక ఏదైనా కారణం ఉంటే ఉండవచ్చని, కానీ న్యాయస్థానం వ్యవహారాలను ఇతర విషయాల్లోకి మళ్లించవద్దని ధర్మాసనం పేర్కొంది.
మొత్తం దేశం కోసం తాము ఆందోళన చెందుతున్నామని బెంచ్ వెల్లడించింది. ఇది తమిళనాడులో జరిగితే బాధాకరమని, జరగకపోతే చాలా మంచిదని వ్యాఖ్యానించింది. దీన్ని ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా పరిగణించవద్దని కోరింది. దీన్ని రాజకీయం చేయొద్దని హితవు పలికింది. అనంతరం కేసు విచారణను వచ్చేనెల 7కు వాయిదా వేసింది.
బలవంతపు మతమార్పిళ్లు దేశ భద్రతకు ప్రమాదకరంగా మారాయని, అది పౌరుల మత స్వేచ్చకు కూడా భంగం కలిగిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని అందువల్ల దీన్ని అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఇటీవల సుప్రీం కోర్టు సూచించింది. బలవంతంగా ఇతరులను మతం మార్పించడ మనేది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
కానుకలు అందజేయడం, భయపెట్టడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశంలో మతమార్పిళ్లు జరుగుతున్నట్టు న్యాయవాది అశ్వనీ కుమార్ అన్నారు. వాటిని అరికట్టేలా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.