లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. ఈ కేసులో ఈడీ విచారణకు సంబంధించి ఈ నెల 20 న హాజరు కావాలని తనకు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ.. తన పిటిషన్ పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ఆమె అభ్యర్థనను కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
ముందుగా తెలియజేసినట్టు ఈ నెల 24 నే మీ పిటిషన్ పై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. మహిళల హక్కులకు విరుద్ధంగా.. నిబంధనలకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తోందని, ఒత్తిడి చేసి స్టేట్మెంట్ తీసుకుంటోందని కవిత తన పిటిషన్ లో ఆరోపించారు.
ఢిల్లీ లోనే ఉన్న ఆమె ఈనెల 16 న ఈడీ ఎదుట హాజరు కాలేదు. తన ప్రతినిధితో ఈడీ అధికారులకు లేఖ పంపారు. అనారోగ్య కారణాలతో తాను రాలేనని అందులో పేర్కొన్నారు,
సుప్రీంకోర్టులో తన పిటిషన్ పెండింగులో ఉందని, కోర్టు నిర్ణయం తరువాత హాజరవుతానని అన్నారు, ఈడీ అధికారులకు పంపిన సుదీర్ఘ లేఖలో ఆమె.. తన నిర్ణయానికి పలు కారణాలను ప్రస్తావించారు. కోర్టు పరిశీలనలో ఉన్నందున ఇది సబ్ జుడీస్ అవుతుందని వివరించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ తో ఆమె ఈ నెల 20 న ఈడీ ఎదుట హాజరు కావలసి ఉంటుంది.