రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తన పిటిషన్ ని విచారణ జాబితాలో చేర్చాలన్న ఆయన అభ్యర్థనను సీజేవై జస్టిస్ డీవై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ అంగీకరించింది. తన కేసును చేబట్టాలని కేంద్రాన్ని కోరవలసిందిగా సుప్రీంకోర్టు .. గత జనవరి 19 న ఆయనకు సూచించింది.
కేంద్ర స్పందన పట్ల సంతృప్తి చెందని పక్షంలో తిరిగి కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఆయనకుందని నాడు పేర్కొంది. గురువారం ఆయన మళ్ళీ కోర్టుకెక్కారు. కొన్ని కేసులను 5 గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోందని, అనంతరం మీ పిటిషన్ పై దృష్టి పెడతామని జస్టిస్ చంద్రచూడ్ ఆయనకు తెలిపారు.
ఈ కేసుల్లో మహారాష్ట్ర విద్యుత్ సంక్షోభం, సర్వీసుల కంట్రోల్ పై ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య తలెత్తిన విభేదాలు వంటివి ఉన్నాయి. రామసేతును వారసత్వ చిహ్నంగా ప్రకటించాలన్న సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకుందని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత జనవరి 19 నే కోర్టుకు తెలిపారు. మెహతా స్టేట్మెంట్ ను కోర్టు నమోదు చేసింది.
అయితే కొన్ని రాజకీయ పార్టీల నుంచి, పర్యావరణ వేత్తలు, కొన్ని హిందూ సంస్థల నుంచి కూడా నిరసనలు వస్తున్న కారణంగా సేతుసముద్రం షిప్పింగ్ ఛానెల్ ప్రాజెక్టు ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. రామసేతు అన్నది ఉందన్న తన తొలి వాదనను కేంద్రం ఇదివరకే అంగీకరించిందని, ఆ లిటిగేషన్ విషయంలో తాను మొదటి దఫాలోనే విజయం సాధించానని సుబ్రహ్మణ్య స్వామి వివరించారు. 2007 లో రామసేతు ప్రాజెక్టు అంశం సుప్రీంకోర్టుకు చేరగా దీనికి నష్టం వాటిల్లకుండా, షిప్పింగ్ మార్గానికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని కోర్టు.. కేంద్రానికి సూచించింది.