”తక్షణమే అల్లర్లను ఆపి…శాంతిని నెలకొల్పాలి” అని సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే కోరారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లాం యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో విద్యార్ధుల అణిచివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ పై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసును రేపు విచారిస్తామని చెప్పారు. ”వాళ్లు విద్యార్ధులైనంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని లేదు…ముందు పరిస్థితులు చక్కబడనీ..ఇలాంటి పరిస్థితుల్లో మనమేమి నిర్ణయం తీసుకోలేం…అల్లర్లు ఆగనివ్వండి” అన్నారు. ”ఆస్తులను ఎందుకు ధ్వంసం చేశారు? బస్సులను ఎందుకు తగులబెట్టారు? ఆ సంఘటనలను మేమే విచారణకు స్వీకరిస్తాం… అల్లర్లు ఎవరు ప్రారంభించినా ముందు వాటిని ఆపండి..” అన్నారు.
విద్యార్దులపై పోలీసుల హింస, యూనివర్సిటీలో ఏం జరిగిందనే దానిపై రిటైర్డ్ జడ్జీలతో విచారణ జరిపించాలని న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గోన్సాల్వేస్ లు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్ధులపై హింస దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో జరుగుతూ మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతున్నందున ఈ ఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని ఇందిరా జైసింగ్ కోర్టును కోరారు. విద్యార్దులను అనవసరంగా అరెస్ట్ చేసి ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేస్తున్నారని…వాటిపై దర్యాప్తు చేయించాలని కొలిన్ గోన్సాల్వేస్ వాదించారు.
వారి వాదనపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ” మనం హింసను కోరుకోవ్దదు…వాస్తవాలను చూసి ఏం చేయాలనే దానికే ఇక్కడ ఉన్నాం.. అది శాంతి భద్రతల సమస్య…దాన్ని పోలీసులే చూస్తారు. ఎవరైనా వీధుల్లోనే తేల్చుకుంటామనుకుంటే కోర్టుకు రావాల్సిన అవసరం లేదు…మేము శాంతియుత ప్రదర్శనలకు వ్యతిరేకం కాదు” అని అన్నారు. మొదటి శాంతిని నెలకొలనీయండి…నిరసనలు..హింసలు కొనసాగుతుంటే..మేము కేసును విచారించలేమని చెప్పారు.