మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనతోపాటు మార్గదర్శి ఎండీ శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కేసు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 120(బీ), 409, 420, 477 (ఏ) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
శనివారం ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇండ్లలో దాడులు జరిపారు. విజయవాడలో సంస్థ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
నెల రోజుల క్రితం హైదరాబాద్ లోని మార్గదర్శి కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు జరిపారు. తనిఖీల్లో అక్రమాలు బయటకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి డబ్బును దారి మళ్లిస్తున్నట్టు తేల్చారు. ఆ డబ్బును వడ్డీలకు ఇవ్వడం, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడం వంటి వాటికి పాల్పడినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలోనే సీఐడీ కేసు నమోదు చేసింది.