మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలకేంద్రంలోని జిల్లా సహకార బ్యాంక్ లో భారీ కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఖాతాదారులైన తమను రూ.54 లక్షల మేర మోసం చేశారంటూ బాధితులు శనివారం రాత్రి జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఖాతాదారులకు, బ్యాంకుకు మధ్య డిపాజిట్ల సేకరణ లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రయివేటు ఏజెన్సీ నిర్వాహకుడు మరికొందరితో చేతులు కలిపి ఈ మోసం చేసినట్టు సీఐ వీరాస్వామికి బాధితులు వివరించారు. విశ్వసనీయ వర్గాలు, సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్లలోని జిల్లా సహకార బ్యాంకులో ప్రయివేటు ఏజెన్సీ ద్వారా ఖాతాదారుల నుంచి రోజూ డబ్బు వసూలు చేసే వ్యక్తి మరికొందరి ప్రమేయంతో రూ.54 లక్షల ఖాతాదారుల డబ్బు తన సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై శనివారం రాత్రి కొందరు ఖాతాదారులు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సీఐ వీరాస్వామి బ్యాంకు అధికారులను ఆరా తీయగా.. ఉన్నతాధికారులు దీనిపై శాఖాపరమైన అంతర్గత విచారణ చేపడతున్నట్టు బ్యాంకు సిబ్బంది వెల్లడించారు. ఇద్దరు ప్రయివేటు వ్యక్తుల ద్వారా డిపాజిట్లు సేకరిస్తుండగా ఒకరు మోసం చేసినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాలతో రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని వారు చెప్పడంతో సీఐ బాధితులకు సర్దిచెప్పగా.. వారు వెనుదిరిగారు. ఇందులో కొందరు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్టు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరు.. ఎవరి పాత్ర ఏమిటన్నది బ్యాంకు అధికారుల విచారణ తరవాత ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.