మార్చి 22 న కరోనాపై యుద్ధం ప్రకటించాయి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనాను నివారించేందుకు దేశవ్యాప్తంగా 75జిల్లాలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులలో తెలంగాణలోని ఐదు జిల్లాలే ఉన్నప్పటికీ… ఆ తరువాయి రాష్ట్ర ప్రభుత్వం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి..మార్చి 31వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ప్రకటనకు మునుపే ప్రభుత్వం …తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలతోపాటు,పబ్బులు, రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేయాలని ఆదేశించింది. రోజురోజుకు కరోనా మహమ్మారి విర్రవీగుతుండటంతో ఈ వైరస్ కు ముకుతాడు వేసేందుకుగాను ఆదివారం నుంచి లాక్ డౌన్ ను విధించింది ప్రభుత్వం. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో సకలం బంద్ ఉంటాయని..అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని.. వేతనంలో కోత విధించవద్దని తేల్చిచెప్పారు. ప్రజలంతా ఇళ్లకు పరిమితం అవ్వాలని…సోషల్ డిస్టేన్సింగ్ పాటించాలని కోరారు. సమూహంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
కానీ,సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ యాజమాన్యం మాత్రం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలని బేఖాతరు చేస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా యధేచ్చగా కార్మికులతో పనులు చేయిస్తూనే ఉంది. మా ప్రాణాలకు ఏమైనా జరిగితే మా కుటుంబాలకు దిక్కెవరని, లైట్ వెహికల్ డ్రైవర్స్, ఓపి ఆపరేటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఎటువంటి హానీ జరగకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపడుతుంటే, అటువంటి సమయంలో మాకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా కనీసం మాస్కులు కూడా ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు వాపోయారు. ప్రైవేటు కార్మికులను ఒకలాగా ,ప్రభుత్వ కార్మికులను ఒకలాగా చూస్తూ మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు .ఒకేసారి ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులను తరలించడం ప్రమాదకరమని తెలిసిన యాజమాన్యం ఇదే విధంగా వ్యవహరిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ విషయమై మీడియాకు చెప్పేందుకు కూడా మమ్మల్ని అనుమతించడం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు మాపై దయవుంచి మాకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వారు కోరారు.