మహారాష్ట్రలో రాజకీయం కీలక మలుపు తిరిగింది. తాజాగా అగాఢీ ప్రభుత్వాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి బల నిరూపణకు ఆదేశించారు. దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది.
అసెంబ్లీలో గురువారం సాయంత్రం బలపరీక్ష నిర్వహించాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో మహారాజకీయం మరింత రసవత్తరంగా మారింది.
అగాఢీ ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ భగత్ సింగ్ కోషియారికి లేఖ అందజేశారు. లేఖ ఇచ్చిన కొద్ది సేపటికే గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
‘ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు అగాఢీ ప్రభుత్వం నుంచి వైదొలిగేందుకు సిద్ధమయ్యారు. మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు లేఖలు పంపారు. ప్రతిపక్ష నాయకులు సైతం కలిసి విశ్వాస పరీక్షకు ఆదేశించాలని కోరారు’ అని బలపరీక్ష ఆదేశాల్లో గవర్నర్ వివరించారు.