ఎన్నికలొస్తే.. పథకాలు.. అయిపోగానే కోతలు పెడుతున్నారని సీఎం కేసీఆర్ పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ వ్యంగాస్త్రాలు సంధించారు. మునుగోడు ఎన్నికల్లో గొర్రెల పంపిణీకి నిధులు అకౌంట్ లో వేశారని, కానీ ఎన్నికలు అయ్యేవరకు ఆ నిధుల్ని ఫ్రీజ్ చేశారని ఆరోపించారు.
ఎన్నికలు అయ్యే వరకు ఓ మాట… తర్వాత ఇంకో మాట మారుస్తారని మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి ఎలా రావాలనేదే కేసీఆర్ యావ అని, మంత్రులేమో వేల కోట్లు వెనక్కి వేసుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపణలు చేశారు.కొందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు రాష్ట్రాన్ని నడుపుతున్నారన్నారు. ఉద్యమంలో ఆంధ్ర నేతలను తిట్టిన కేసీఆర్.. ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాడని తెలిపారు. ఆంధ్ర,తెలంగాణ మధ్య చిచ్చు పెట్టింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ సూచన మేరకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని మహేశ్ గౌడ్ తెలిపారు.
పీసీపీ ప్రధాన కార్యదర్శి చెరుకు సుధాకర్ కూడా కేసీఆర్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. గోల్ మాల్ గోవిందం ఎక్కడో లేడని.. కేసీఆర్ గోల్ మాల్ గోవిందమని అభిప్రాయపడ్డారు. రైతు స్వరాజ్య వేదిక నివేదక ఇస్తే.. ఉరికించి కొడతానని మీ ఎమ్మెల్సీ అన్నారన్నారు. అదీ.. రైతు మీద మీకున్న చిత్తశుద్ధి అని ఎత్తి చూపారు.
మునుగోడులో 30 వేల మంది యాదవుల అకౌంట్ లో డబ్బులు వేసి, ఆ తర్వాత వాటిని ఫ్రీజ్ చేశారన్నారు. కేసీఆర్ కి నిజంగా విజన్ ఉంటే.. ఇన్ని అప్పులు తెచ్చేవాడా? అని నిలదీశారు. ప్రభుత్వ స్థలాలు అమ్మింది. అమ్ముతోంది కేసీఆరేనని ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ.. అమిత్ షా కి హాట్ లైన్ లో ఉండి పని చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులందరూ కలిసి.. బీఆర్ఎస్ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు.