ఈ మధ్య హిట్ అండ్ రన్ కేసులు బాగా ఎక్కువ అవుతున్నాయి. గత రెండు, మూడు రోజులుగా చాలా హిట్ అండ్ రన్ కేసులు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. స్కూల్ విద్యార్థిని ఓ కారు ఢీ కొట్టి.. కిలోమీటరు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్ కు చెప్పినా.. అతడు పట్టించుకోలేదు. చివరకు రద్దీ ప్రాంతంలో ఆ కారును జనం అడ్డుకుని విద్యార్థిని కాపాడారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని హర్దోయ్ లో జరిగింది.
శుక్రవారం సాయంత్రం 9వ తరగతి చదువుతున్న కేతన్ కుమార్ అనే బాలుడు సైకిల్ పై ట్యూషన్ కు వెళ్తున్నాడు. తెల్లని వ్యాగనార్ అతడి సైకిల్ పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆ విద్యార్థి కాలు కారు వెనుక చక్రం భాగంలో ఇరుక్కుంది. అయినా కారు డ్రైవర్ ఇది గమనించకుండా వేగంగా వెళ్తున్నాడు.
మరోవైపు గమనించిన స్థానికులు కారు ఆపాలని కేకలు వేస్తూ వెంటపడ్డారు. అయినప్పటికీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపకపోగా వీధుల్లో వేగంగా నడిపాడు. అయితే జనం రద్దీగా ఉండే చోట ఆ కారును కొందరు అడ్డుకుని, విద్యార్థిని కాపాడారు. అనంతరం ఆ డ్రైవర్‌ను కర్రలతో చితక్కొట్టారు.
కారును ఒకవైపుకి తోసి ధ్వంసం చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు జనం బారి నుంచి డ్రైవర్ ను కాపాడి అరెస్ట్ చేశారు. గాయపడిన విద్యార్థి కేతన్ కుమార్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.