రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో 30 మంది చిన్నారులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
మాచన్ పల్లి, కోడూరు మధ్య ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రైల్వే అండర్ బ్రిడ్జిలో చేరిన వరదనీటిలో చిక్కుకుపోయింది. స్కూల్ బస్సు సగం వరకు నీట మునిగింది. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 30 మంది పిల్లలు ఉన్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు బస్సు నుంచి పిల్లలను బయటకు తీసి కాపాడారు.
పీకల్లోతు నీటిలో చిన్నారులను ఒక్కొక్కరుగా జాగ్రత్తగా బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ సహాయంతో బస్సును బయటకు లాగారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల నుండి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి నీరు చేరింది. రామచంద్రాపూర్, మాచన్ పల్లి, సుగుర్ గడ్డ తాండా నుండి 30 మంది విద్యార్థులను మహబూబ్ నగర్ తీసుకెళ్తుండగా బస్సు నీటిలో చిక్కుకుపోయింది.