సీబీఎస్ఈ, మండల విద్యాధికారి నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే అడ్మిషన్లను పటాన్ చెరువులోని సెయింట్ జోసఫ్ హైస్కూల్ యాజమాన్యం ప్రారంభించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులను యాజమాన్యం వసూలు చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే ఫీజులను గత నెలలో ప్రిన్సిపాల్ పెంచారని, ఈ మేరకు తమకు నోటీసులు పంపారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఎంత శాతం ఫీజులు పెంచుతున్నారనే విషయం తమకు చెప్పలేదని, కొద్ది పాటి పెంపు మాత్రమే ఉంటుందని తాము ఆ నోటీసులపై సంతకాలు చేసినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
కానీ ఫీజును ఒక్క సారిగా మూడు రెట్లు పెంచారని, కట్టలేకపోతే మీ పిల్లల టీసీ తీసుకుని వెళ్లిపోవాలని దురుసుగా ప్రవర్తించారని వారు వాపోయారు. దీంతో తాము ఎంఈఓకు ఫిర్యాదు చేయగా ఆయన వచ్చి పాఠశాలను పరిశీలించారని పేర్కొన్నారు. అనంతరం ఈ ఏడాది సీబీఎస్ఈ, ఎస్ఎస్ సీలకు అడ్మిషన్లు నిర్వహించకుండా పాఠశాలకు నోటీసులను ఎంఈవో జారీ చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు వివరించారు.
వారం రోజులు గడిచిన తర్వాత సదరు ప్రిన్సిపల్ మళ్లీ అడ్మిషన్లను ప్రారంభించారని, ఫీజును కూడా పెంచినట్టు వారు చెబుతున్నారు. ఇదేంటని అడిగిన తమను ప్రిన్సిపల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మరీ గట్టిగా అడిగితే స్కూల్ నుంచి వెళ్లిపోయేలా తమ పిల్లలపై ప్రిన్సిపల్ ఒత్తిడి తెస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. దీనిపై విద్యాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.