బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు..తప్పుడు మార్గంలో ఎలా ఉతీర్ణులు కావాలో చెప్పుకొచ్చాడు. పరీక్షల్లో పాస్ కావాలంటే కేవలం జవాబు పత్రంలో 100రూపాయలు ఉంచితే చాలంటూ విద్యార్థులకు తప్పుడు సందేశం ఇచ్చాడు. పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో.. ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాల్ విద్యార్థులకు అవగాహనా కల్పించేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి విద్యార్థులతోపాటు వారి పేరెంట్స్ కూడా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ఏ ఒక్క విద్యార్ధి పరీక్షలో ఫెయిల్ అయ్యే సమస్యే ఉండదని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నాని చెప్పారు. ఎవ్వరు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు హాజరు కావాలని.. ఇన్విజిలేటర్లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కనుక కను సైగలతోనే విద్యార్థులు మాట్లాడుకోవాలన్నారు. చీటీలతో పట్టుబడిన ఒకట్రెండు దెబ్బలు కొడతారు తప్ప ఎలాంటి సమస్య ఉండదని చెప్పుకొచ్చారు.
విద్యార్థులు చేయాల్సిందల్లా ఒక్క ప్రశ్న వదలకుండా సమాధానాలు రాసి రావాలన్నారు. తప్పుడు సమాధానాలు రాసిన… నాలుగు మార్కులకు కనీసం మూడు మార్కులు ఖచ్చితంగా పడతాయన్నారు. అలాగే ఓ ఒక్క విద్యార్ధి మర్చిపోకుండా ఆన్సర్ షీట్ లో 100రూపాయలు పెట్టాలని.. దాంతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని బోధించారు. ప్రిన్సిపాల్ అక్కడ మాట్లాడుతోన్న సమయంలోను ఓ విద్యార్ధి రహస్యంగా వీడియో తీసి.. సీఎం యోగి గ్రీవెన్స్ సెల్‌లో అప్‌లోడ్ చేశాడు. దాంతో సీఎం విచారణకు ఆదేశించారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మావు జిల్లాలో జరిగిన తతంగమిది.