హైదరాబాద్ దోమలగూడలో కీచక టీచర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. గగన్ మహల్ లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూల్ లో పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. చదువు చెప్పాల్సింది పోయి.. ఫోటోలు తీస్తూ తాను చెప్పినట్లు వినాలంటూ వేధిస్తున్నాడు. రోజురోజుకీ అతడి విచిత్ర చేష్టలు ఎక్కువవడంతో తట్టుకోలేక.. స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ కూర్చున్నారు విద్యార్థినులు.
ఏం జరిగిందో తెలుసుకుని.. స్కూల్ కు వెళ్లి శ్రీనివాస్ ను నిలదీశారు తల్లిదండ్రులు. కొంతకాలంగా పిల్లలతోపాటు తోటి మహిళా టీచర్లతోనూ అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా తన వైఖరిలో మార్పు రాలేదని చెప్పారు హెచ్ఎం జ్యోతి. అయితే శ్రీనివాస్ దివ్యాంగుడు కావడంతో దాడి చేయకుండా పోలీసులకు అప్పగించారు విద్యార్థునుల తల్లిదండ్రులు.