తరగతి గదిలో క్రిమిసంహారక మందును తాగి ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ (రామప్ప) మండలం కేశవపూర్ గ్రామ పంచాయతీ పరిధి ఒడ్డెరగూడెంలో గురువారం చోటుచేసుకుంది.కేశవపూర్‌కు చెందిన ఆరెపల్లి అక్షర ఒడ్డెగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. మధ్యాహ్నం విరామ సమయంలో అక్షరతోపాటు అదే తరగతిలో చదివే తోటి విద్యార్థిని అఖిల, ఐదో తరగతి విద్యార్థిని ఐశ్వర్య భోజనం చేశారు.
ఈ క్రమంలో అక్షర వద్ద ఉన్న బాటిల్‌లోని నీళ్లను ముగ్గురూ తాగారు. కాసేపటికే వారికి కడుపు నొప్పి మొదలైంది. దీంతో ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు రాజేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనుమానం వచ్చి బాటిల్‌ను ఆయన పరిశీలించగా క్రిమిసంహారక మందు వాసన వచ్చింది. దీంతో వెంటనే బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ముగ్గురిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికలు చికిత్స పొందుతుండగా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యుడు చిరంజీవి తెలిపారు.
అక్షర బ్యాగులో లంచ్‌బాక్సుతో తెచ్చుకున్న ఖాళీ కూల్‌డ్రింక్ బాటిల్‌లో క్రిమిసంహారక మందు ఉండటం పాఠశాలలలో కలకలం రేపింది. ఇంటి వద్ద నుంచి వచ్చేటప్పుడే ఆమె ఈ బాటిల్‌ను తెచ్చుకుందని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ ఘటనతో ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే గమనించకుంటే తమ పిల్లలకు ప్రాణాపాయం ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పినందుకు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. అక్షర బ్యాగులోకి క్రిమిసంహారమందు బాటిల్ ఎలా వచ్చిందనే అంశంపై ఆమె తల్లిదండ్రులు రాజు, మానస ఆరా తీస్తున్నారు.