ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూను విధించనున్నట్టు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. స్కూళ్లకు సెలవులు పొడిగించకుండా పిల్లల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కరోనా ఉధృతి తగ్గే వరకు పాఠశాలలు తెరవొద్దని ఆయని డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్ కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేశానని లోకేష్ పేర్కొన్నారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని ట్విట్టర్ లో వివరించారు.
అటు 15 ఏళ్ల పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని.. ఈ సమయంలో స్కూళ్లు నిర్వహించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని లోకేష్ వ్యాఖ్యానించారు. కరోనా థర్డ్ వేవ్ రూపంలో ప్రమాదం పొంచిఉందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల జీవితాలతో చెలగాటం ఆడొద్దని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు 500 నుంచి 5000కు పెరిగాయన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా 10 శాతానికి పెరిగిందని లోకేష్ తెలిపారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రళయం రావడం ఖాయం అని లోకేష్ అన్నారు.