కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తెలంగాణలో సూళ్లు మళ్లీ మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో క్రమంగా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే 10వ తరగతిలోపు అన్ని పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను వెంటనే మూసివేస్తేనే మంచిదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టుగా అధికారులు చెప్తున్నారు. వైద్యారోగ్యశాఖ సూచనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిన అనంతరం, ఒకటి రెండు రోజుల్లో స్కూళ్ల మూసివేతపై ప్రకటన వస్తుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా అభివృద్ధి చెందడానికి స్కూల్ విద్యార్థులే కారణమవుతున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు. వారికి సోకడమే కాక.. ఇళ్లకు వెళ్లాక కుటుంబ సభ్యులకు వ్యాపించేందుకు వాహకంగా మారుతున్నారని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఈ రకంగా కరోనా బారినపడినవారు వెయ్యి మంది వరకు ఉంటారని చెప్తున్నారు. ఒక రకంగా స్టూడెంట్సే సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారని అధికారులు చెప్తున్నారు.
బడులు మొదలైనప్పటి నుంచే కేసులు విపరీతంగా పెరిగిపోవడం ఇందుకు బలాన్నిస్తోందని చెప్తున్నారు.ఈ క్రమంలో కరోనా విజృంభణను నివారించాలంటే.. వెంటనే స్కూళ్లు మూసివేయడం సరైన చర్యగా భావిస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.