ఇప్పటికే కరోనా వైరస్ చైనాలో 1355 మందిని బలి తీసుకొని, రోజు రోజుకు విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనిని నియంత్రించే వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచ శాస్త్రవేత్తలు తలమునకలవుతుండగా తాజాగా బ్రెజిల్ లో కొత్త రకం వైరస్ ను ఆ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త రకం వైరస్ ఇప్పుడు శాస్త్రవేత్తలను భయపెడుతోంది. వేరే వైరస్ గురించి అధ్యయనం చేస్తుండగా ఓ నీటి కొలనులో ఈ కొత్త రకం వైరస కనిపించింది. ఈ వైరస్ కు ”యారా” అని పేరు పెట్టారు. బ్రెజిల్ లోని స్థానిక టుపీ గురానీ తెగల పురాణాల్లో ”యారా”ను నీటి దేవతగా భావిస్తారు. అందుకే ఈ వైరస్ కు ఆ పేరు పెట్టారు.
ఈ కొత్త రకం వైరస్ శాస్త్రవేత్తలకు సవాలు మారింది. దీనిలో మొత్తం 74 జీన్స్ ఉండగా…వాటిలో 6 మాత్రమే ఇప్పటి వరకు కనుగొన్న జీన్స్ తో మ్యాచ్ అవుతున్నాయి. మిగతా జీన్స్ అన్ని కొత్తవి. ప్రపంచంలోని మొత్తం 8,500 జన్యు సంబంధాలను పరిశీలించినా కూడా ఈ వైరస్ కు సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. దీంతో ఈ వైరస్ మిస్టరీగా మారింది. ఈ వైరస్ వల్ల వైరస్ లో డీఎన్ ఏ విభిన్నంగా ఉంటుందని మొదటి సారిగా తెలుసుకున్నామని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న బ్రెజిల్ లోని ఫెడరల్ యూనివర్సిటీ సైంటిస్ట్ మినాస్ గెరైస్ చెప్పారు.
ఈ కొత్త రకం యారా వైరస్ అన్ని అమీబా వైరస్ ల కంటే భిన్నంగా 80 నానో మీటర్ల వ్యాసంతో ఉంది. ఈ వైరస్ ఎప్పుడు, ఎక్కడి నుంచి పుట్టిందనేది తెలియడం లేదు. ఈ వైరస్ మానవాళికి ప్రమాదకరమని తెలిపే సూచనలు ఇప్పుడేమి కనిపించడం లేదని…ఇది మానవాళికి ఎంత వరకు ప్రమాదమనే విషయంపై పరిశోధనలు చేస్తున్నట్టు బ్రెజిల్ శాస్త్రవేత్తలు తెలిపారు.