కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది రక రకాల మాస్కులను ధరిస్తున్నారు. అయితే ఏ మాస్కును ధరించినా సరే క రోనా వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. వైరస్ ఉన్నవారి నుంచి వెలువడే కణాలు గాలిలో కలిసి ఇతరులకు ముక్కు, కళ్లు, నోరు ద్వారా వ్యాప్తి చెందుతాయి. అయితే ఆయా భాగాలను కప్పి ఉంచేలా మాస్కులను ధరిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కానీ పలువురు సైంటిస్టులు తయారు చేసిన ఓ నూతన తరహా మాస్క్ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడమే కాదు, ఏకంగా ఆ వైరస్ ను, ఇతర బాక్టీరియాలను కూడా నిమిషాల వ్యవధిలోనే చంపేస్తుంది.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఓ నూతన తరహా కాటన్ వస్త్రాన్ని రూపొందించారు. దాన్ని 2-డైఇథైలమైనోఇథైల్ క్లోరైడ్ (డీఈఏఈ-సీఎల్) అనే సమ్మేళనంతో చార్జ్ చేశారు. ఈ క్రమంలో సదరు వస్త్రం బాక్టీరియా, వైరస్‌లను చంపే వస్త్రంగా మారింది. అయితే సదరు సమ్మేళనం చార్జ్ అయ్యి వస్త్రంపై చేరే వైరస్, బాక్టీరియాలు నశించాలంటే ఆ వస్త్రం కనీసం 60 నిమిషాలు ఎండలో ఉండాలి. దీంతో వస్త్రంపై ఉండే ఆ సమ్మేళనం వస్త్రంపైకి రీయాక్టివ్ ఆక్సిజన్ స్పిసీస్ (ఆర్వోఎస్) అనే పదార్థాలను వదులుతుంది. ఈ క్రమంలో వస్త్రంపై ఉండే కరోనా వైరస్‌తోపాటు, ఇతర వైరస్, బాక్టీరియాలు నశిస్తాయి.
ఇక పరిశోధకులు తయారు చేసిన సదరు వస్త్రంతో మాస్క్‌ను రూపొందించి పెట్టుకుంటే దానిపై చేరే వైరస్‌లు, బాక్టీరియాలు 99.99 శాతం వరకు నశిస్తాయి. కానీ ఆ మాస్క్ పనిచేయాలంటే ఎండలో ఉండాలి. కాగా ఆ మాస్క్ ను కనీసం 10 సార్లు ఉతికి వాడేందుకు వీలుంటుందని పరిశోధకులు తెలిపారు. అయితే ఆ మాస్క్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, దాని ధర ఎంత అన్న వివరాలను వారు వెల్లడించలేదు. కాగా వారి పరిశోధనలకు చెందిన వివరాలను ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్‌ఫేసెస్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు.