కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా వణికిపోతోంది. దానిని అరికట్టేందుకు ప్రభుత్వాలు శాస్త్రవెత్తలు శ్రమిస్తున్నారు. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ తో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. మహమ్మారినుండి ప్రాణాలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వాలు సైతం తగు చర్యలను చేపుడుతోంది. తాజాగా గ్రీన్ టీ తో కరోనా ను అరికట్టవచ్చని పరిశోదకులు చెప్తున్నారు. గ్రీన్ టీలో ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని వారు చెప్తున్నారు.
కరోనా వైరస్ ను అడ్డుకునే శక్తి గ్రీన్ టీలో ఉందని వారి అధ్యయనంలో తెలినట్టు వెల్లడించారు. కరోనా వైరస్ అరికట్టడంలో గ్రీన్ టీ ప్రభావం ఏ మేరకు చూసుతోందనేదానిపై ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార సంస్థలోని వివిధ విభాగాలు, ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన శాస్త్రవేత్తలు కరోనా మొదటి రెండు దశల్లో దాదాపు 6 నెలలపాటు ల్యాబ్ లో పరిశీలనలు చేసినట్టు వారు తెలిపారు.
సాధారణంగా గ్రీన్ టీలో ఎపిగాల్లో కాటెచిన్-3-గాలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది బయట గాలితో కలిసినప్పుడు ఆక్సీకరణం చెంది వివిధ మ్యాలిక్యూల్స్ గా విడిపోతుంది. మానవ కణాలపై వీటిని ప్రయోగించినప్పుడు కొవిడ్ నియంత్రణకు తోడ్పాటు అందిస్తాయి. కొవిడ్ బాధితుల్లో ఇన్ ఫ్లమేషన్ అతిపెద్ద సమస్య. కరోనా రెండో దశలో కొందరికి శరీరంలోని వివిధ భాగాల్లో ఇన్ ఫ్లమేషన్ పెరిగి ప్రాణాల మీదకు వచ్చింది.
ఇలాంటి విపత్కర సమయంలో గ్రీన్ టీలో ఉండే ఈజీసీజీ ఇతర మూలకాలు ఇన్ ఫ్లమేటరీ మార్కర్లను తగ్గించడంలో కీలకంగా మారుతున్నట్లు శాస్త్రవెత్తలు చెప్తున్నారు. అంతేకాక ఊపిరితిత్తుల్లోని స్పైక్ ప్రొటీన్లనూ ఈజీసీజీ.. ఇతర మాలిక్యూల్స్ అడ్డుకుంటున్నట్లు ప్రాథమిక అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఎల్-6, ఐఎల్-1బీటా, టీఎన్‌ఎఫ్-గామా తదితర ఇన్ ఫ్లమేటరీ మార్కర్‌లనూ సమర్థంగా నిరోధిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారు నిత్యం 3, 4 కప్పులు గ్రీన్ టీ తీసుకోవడం ఉత్తమమని శాస్త్రవెత్తలు సూచిస్తున్నారు.