వాహన తుక్కు చట్టం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా డొక్కు, తుక్కు వాహనాల లెక్కలు తీసే పనిలో పడింది కేంద్రం. ఈ మేరకు దేశంలో 4 కోట్లకుపైగా డొక్కు వాహనాలు ఉన్నాయని లెక్కగట్టింది. ఇందులో సగానికిపైగా అంటే 2 కోట్ల వాహనాలు 20 ఏళ్ల పైబడినవే ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వివరాలను డిజిటలైజ్ చేసింది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్‌కు సంబంధించిన వివరాలు మాత్రం ఇందులో అందుబాటులో లేవు.
రాష్ట్రాలవారీగా వివరాలను పరిశీలిస్తే .. అత్యధికంగా సుమారు 70 లక్షల డొక్కువ వాహనాలు ఒక్క కర్ణాటకలోనే ఉన్నట్టుగా కేంద్రం తెలిపింది. ఆ తర్వాత యూపీలో 56.64 లక్షలు, ఢిల్లీ- 49.93 లక్షలు, కేరళ- 34.64 లక్షలు, తమిళనాడు- 33.43 లక్షలు, పంజాబ్- 25.38 లక్షలు, పశ్చిమ బెంగాల్- రూ.22.69 లక్షల డొక్కు వాహనాలు ఉన్నట్టు తెలిపింది.
ఇక మహారాష్ట్ర, రాజస్థాన్, , హర్యానా, ఒడిశా,గుజరాత్‌లో పాత వాహనాల సంఖ్య 17.58 లక్షల నుంచి 12.29 లక్షల మధ్య పాత వాహనాలు ఉన్నాయని వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ , అసోం, బిహార్, పుదుచ్చేరి, గోవా, త్రిపుర, దాద్రా నగర్ హవేలీ, డమన్ డయ్యూలో లక్ష నుంచి 5.44 లక్షల మధ్య పాత వాహనాలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాత వాహనాలు లక్ష కంటే తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.
20 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనాలను, 15 ఏళ్ల పైబడిన ఇతర వాహనాలను డొక్కు వాహనాల కింద పరిగణిస్తూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాత వాహనాల కారణంగా కాలుష్యం పెరిగే అవకాశం ఉందని.. ఇటీవలే వాహన తుక్కు విధానం చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని ఉపయోగించాల్సి వస్తే హరిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లేదా వాటిని తక్కుగా మార్చుకునేందుకు రెడీ అయితే.. కొత్త వాహనాలు కొనుగోలు చేసేప్పుడు డిస్కౌంట్ ఇప్పించేందుకు ప్రతిపాదనలు చేసింది.