మార్చి2 నుంచి సినిమాలు బంద్!

ఫిలిం ఇండస్ట్రీకి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య మొదలైన ‘గొడవ’కు ఇప్పుడప్పుడే ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రదర్శనకింత అంటూ ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్న డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల దోపిడీ మీద.. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం ఛాంబర్ కలుగజేసుకుని.. టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్, శాండల్ వుడ్.. దక్షిణాదిలో వున్న అన్ని చిత్ర పరిశ్రమల్ని కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళకూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య అనేక విడతలుగా చర్చలు జరిగినా ఈ ప్రతిష్టంభనకు తెరపడలేదు. తాజాగా జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. JAC పెట్టిన నిబంధనలకు Qube, UFO కంపెనీలు నిరాకరించేశాయి. ఈ క్రమంలో కఠిన నిర్ణయానికి వచ్చేసింది జేఏసి. మార్చి 2 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్నది JAC తాజా డెసిషన్.

కానీ.. మార్చి 2నుంచి థియేటర్లు మూసివేయాలన్న పరిశ్రమ నిర్ణయం పెద్ద సినిమాల మీద పెను ప్రభావం చూపించనుంది. ఈ ‘బంద్’ పిలుపునిచ్చినంత సులభంగా అమలుచెయ్యలేమన్న గుబులు కూడా వుంది. సరిగ్గా.. మార్చి సీజన్లోనే రజనీకాంత్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి బడా హీరోల సినిమాలు రిలీజుకు సిద్ధంగా వున్నాయి. ఆలోగానే.. ఈ ‘డిజిటల్’ లొల్లిని సర్దేయాలని పెద్దలు ప్రయత్నించినా ఫలితం దొరకలేదు. చూడాలి ఈ ‘రగడ’ ఏ మలుపు తిరుగుతుందో?