పెళ్ళిళ్ళలో సందడి తెచ్చేవి బ్యాండ్ బాజా, క్రాకర్సే అవిలేకపోతే పెళ్ళికి వచ్చిన బంధువులకు ఒక ఊపు, ఉత్సాహం ఉండదు సరికదా..! అక్కడో పెళ్ళి జరుగుతున్న సంగతి కూడా బైట జనానికి తెలియదు. అంతటి ప్రాధాన్యత ఉన్న క్రాకర్స్ విషయంలో వధువు, వరుడు వర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది.
చిన్న గొడవ చినుకు చినుకు గాలివానై ఇరువర్గాల వారు రక్తాలొచ్చేలా కొట్టుకునేదాకా వచ్చింది. దీంతో రంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహ వేడుక రభసగా మారింది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మెప్పయ్యూర్ పట్టణంలోని వరుడి ఇంటికి పెళ్లి బృందం చేరింది. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు పటాకులు పేల్చారు. అయితే అక్కడున్న వధువు బంధువులకు ఇది నచ్చలేదు. వరుడి స్నేహితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది.
వాగ్వాదం కాస్తా తోపులాటకు దారి తీసింది. ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో ఇరు వర్గాలకు చెందిన కొందరు యువకులు కొట్టుకున్నారు. కాగా, ఇతర బంధువులు, స్థానికులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ మరింత పెద్దది కాకుండా కొట్టుకుంటున్న వారిని పెళ్లి వేదిక నుంచి బయటకు పంపారు.
చివరకు ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే పెళ్లిలో జరిగిన ఈ ఘర్షణపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. మరోవైపు ఈ ఫైటింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.