నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన రాజకీయ పార్టీ.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయాలని సంకల్పించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. ఇదే జరిగితే మైనారిటీ ఓట్లు చీలి బీజేపీకి లాభం, కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగవచ్చునని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యామ్న్యాయ రాజకీయ వ్యవస్థగా తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎం.కె.ఫైజీ తెలిపారు.
తాము అప్పుడే మొదటి జాబితాలో బెంగుళూరు, దక్షిణ కన్నడ, మైసూరు, ఉడిపి, చిత్రదుర్గతో బాటుమరికొన్ని జిల్లాలకు తమ అభ్యర్థులను ప్రకటించామని ఆయన చెప్పారు. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పార్టీని మీరంటే మీరు ప్రోత్సహిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకదానికొకటి ఆరోపించుకుంటున్నాయి. ఓట్లు చీలిపోవడానికి దీన్ని బీజేపీ రెచ్చగొడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. తన బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ ఈ పార్టీని వాడుకుంటోందని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది.
ఇది బీజేపీ బీ టీమ్ తప్ప మరేమీ కాదని, తమ పార్టీని ఓడించాలన్నదే ఈ పార్టీl లక్ష్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ప్రియాంక్ ఖర్గే అన్నారు. అయితే బీజేపీ నేతలు ఈ ఆరోపణను ఖండిస్తున్నారు. ఆ పార్టీతో మీరే కుమ్మక్కవుతున్నారని, మీతో అవగాహన కుదుర్చుకుని అది పోటీ చేస్తోందని ఉడిపి బీజేపీ ఎమ్మెల్యే రఘుపతి భట్ ఆరోపించారు. ఏమైనా సోషల్ డెమాక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ కారణంగా మైనారిటీల ఓట్లు చీలడం ఖాయమని,ఇది బీజేపీకి ప్రయోజనం కల్పిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ముస్లిములు మరోలా భావించిన పక్షంలో పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినా మారవచ్చునని బెంగుళూరులోని పొలిటికల్ ఎనలిస్ట్.. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు ఏ. నారాయణ వ్యాఖ్యానించారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగమైన ఈ పార్టీ గతంలో స్థానిక ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. 2013 లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ 23 సీట్లకు పోటీ చేసి.. 3.27 ఓట్ల శాతాన్ని పొందగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలవలేకపోయినా .. 2021 లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 6 స్థానాలను దక్కించుకుంది.