ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆప్ నేత సంజయ్ సింగ్ సన్నిహితుడు అజిత్ త్యాగి, కాంట్రాక్టర్, మరో వ్యాపారి నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తన ఇద్దరు సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు చేసిందని సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని విఠల్ భాయ్ పటేల్ హౌస్ లోని సర్వేశ్ మిశ్రా నివాసంలో ఈడీ దాడులు చేసినట్టు ఆయన ఆరోపించారు. కేంద్రం బెదిరింపులు తారాస్థాయికి చేరుకుందని వెల్లడించారు. తాను ప్రధాని మోడీ నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చెప్పారు.
ఈడీ నకిలీ విచారణ దేశం ముందు బట్టబయలైందన్నారు. ఈడీ తన తప్పును అంగీకరించిందని పేర్కొన్నారు. తన సహచరులు అజిత్ త్యాగి, సర్వేష్ మిశ్రాల ఇళ్లలో ఈడీ దాడులు చేసిందన్నారు. సర్వేశ్ మిశ్రా తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారని చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రాజ్య సభ ఎంపీ సంజయ్ సింగ్ పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ దాడులు చేసినట్టు చెబుతున్నారు. దీన్ని ఆప్ ఖండిస్తోంది. ఇటీవల ఛార్జ్ షీట్‌లో సంజయ్ సింగ్ పేరును పొరబాటున చేర్చడంతో ఆయన పరువు నష్టం దావా వేశారని ఆప్ చెబుతోంది. ఈ క్రమంలోనే సంజయ్ సింగ్, ఆయన సన్నిహితులను ఈడీ వేధిస్తోందని ఆప్ ఆరోపించింది.