– రెచ్చిపోతున్న ఆశావాహులు
– అసెంబ్లీ సీటుపై బహిరంగ ప్రకటనలు
– ఉమ్మడి వరంగల్ సీట్ కోసం ఫైట్
– రేవంత్ ప్రోగ్రాంలో ఫ్లెక్సీ వార్
ఎన్నికల నగారా మోగడానికి సిద్ధం అవుతుంటే సీట్ల వార్ పార్టీల్లో.. వర్గ పోరును బహిర్గతం చేస్తోంది. ఇప్పటి వరకు నివ్వురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత పోరు కాస్త నడి బజారున పడుతోంది. సీట్ల కేటాయింపుల గురించి ఇప్పుడే నోరు జారొద్దని అధిష్టానాలు నెత్తినోరు బాదుకుంటున్నా.. ఛాన్స్ దొరకగానే ఆశావాహులు మాత్రం రెచ్చిపోయి..స్వయం ప్రకటనలు చేసి అలజడి రేపుతున్నారు.
తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో ఇదే జరిగింది. హనుమ కొండ కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఇప్పుడు టీపీసీసీకి పెద్ద తలనొప్పిగా మారాయి. వచ్చే ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గం నుంచి పోటీ చేసేది తానే అంటూ ఆయన ప్రకటించుకున్నారు.
పొరుగు జిల్లా నుంచి, పక్క పార్టీ నుంచి ఎవరూ వచ్చినా తమపై పెత్తనం చేస్తే ఇక సహించమని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎదుటే తాను పోటీచేస్తానని ప్రకటించుకోవడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే నాయిని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మద్దతుగా నిలిచారు.
ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడావని నాయిని రాజేందర్ రెడ్డి సమర్థించారు. అయితే గత కొద్ది కాలంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తోంది. ఈ నియోజక వర్గం కాంగ్రెస్ టికెట్ కోసం డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి మధ్య పోటీ నెలకొంది.
టికెట్ నాదంటే నాది అంటూ ఎవరికి వారే అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా వీరి వర్గ పోరు బయటపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాక సందర్భంగా పశ్చిమ నియోజక వర్గంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నాయిని రాజేందర్ రెడ్డి వర్గీయులు,జంగా రాఘవరెడ్డి వర్గీయలు పోటా పోటీగా ఫ్లెక్సీలు నెలకొల్పారు. ఈ వివాదం నడుస్తుండగా.. తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలోనే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ పై నాయిని రాజేందర్ రెడ్డి ప్రకటన మరింత వివాదాన్ని రాజేసింది. మరి టీపీసీసీ దీన్ని ఇలా తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది.