అదానీ గ్రూప్ వ్యవహారాలపై హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ దిగ్భ్రాంతికరమైన నివేదికను బయటపెట్టడంతో మార్కెట్ రెగ్యులేటర్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా..సెబీ రంగంలోకి దిగింది. అదానీ గ్రూపు సంస్థల కార్యకలాపాలపై స్క్రూటినీని పెంచింది. ఆ రిపోర్టును తమ సొంత విచారణకోసం వినియోగించుకునే అవకాశం ఉందని సెబీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ గ్రూప్ కు చెందిన ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లపై ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ మొదలయిందని పేర్కొన్న ఈ వర్గాలు.. గత ఏడాది కాలంలో అదానీ గ్రూప్ చేబట్టిన వివిధ డీల్స్, నిర్వహించిన లావాదేవీలపై తమ పరిశీలన కొనసాగుతూ వచ్చినట్టు వెల్లడించాయి.
ఇక హిండెన్ బెర్గ్ రిపోర్టును తాము పూర్తిగా చదువుతామని పేర్కొన్నాయి. అయితే తమ విచారణకు సంబంధించిన అంశాలు రహస్యంగా ఉంటాయని సెబీకి చెందిన ఓ అధికారప్రతినిధి చెప్పారు. తాము కంపెనీకి చెందిన నిర్దిష్ట అంశాలపైనా, ప్రస్తుతం నిర్వహిస్తున్న విచారణలపైనా చర్చించబోమన్నారు.
అదానీ కంపెనీలకు చెందిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థల్లో స్విట్జర్లాండ్ కి చెందిన హోల్సిమ్ లిమిటెడ్ వాటాను ఈ గ్రూప్ దక్కించుకోవడం, ఈ లావాదేవీలకోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ని వినియోగించుకోవడం వంటిఅంశాలను సెబీ ఇదివరకే పరిశీలించింది. ఈ వ్యవహారాల్లో నిధులకు సంబంధించి 17 కి పైగా విదేశీ ఆఫ్ షోర్ ఎంటిటీల ప్రమేయం ఉన్నట్టు సెబీ కనుగొంది. గత ఏడాది వీటి క్లియరెన్స్ కోసం అదానీ గ్రూపు కంపెనీలు తమను సంప్రదించినప్పుడు వీటిపై క్లారిటీనివ్వాలని తాము కోరినట్టు సెబీ వర్గాలు వెల్లడించాయి. వీటిని ఈ సంస్ధ ఇంకా పరిశీలిస్తున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్ధ పేర్కొంది.
యాంకర్ ఇన్వెస్టర్ల కోసం 20 వేల కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ ని అదానీ ఎంటర్ ప్రైజెస్ శుక్రవారం ఓపెన్ చేయడానికి రెండు రోజుల ముందు హిండెన్ బెర్గ్ రిపోర్టు ‘బాంబు’ లా పేలింది. నిజానికి ఈ ప్రక్రియ బుధవారమే జరగాల్సి ఉన్నా శుక్రవారానికి వాయిదా పడింది.