ఏపీలో ఎన్నికల కమిషనర్, ప్రభుత్వం మధ్య ఏర్పడిన పంచాయితీ ఎన్నికల పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టి హెచ్చరికలే పంపారు. ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మానసపుత్రికగా ఎన్నికల కమిషన్ రూపోందిందని, ఎన్నికలు నిర్వహించటం తన బాధ్యత అంటూ నిమ్మగడ్డ ప్రభుత్వానికి బహిరంగంగా సమాధానం చెప్పారు.
ఇక ఎన్నికల్లో కీలకమైన పంచాయితీరాజ్ శాఖ పనితీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన… సరైన సమయంలో పంచాయితీరాజ్ కార్యదర్శి, కమిషనర్ పై చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ మెమోను పట్టించుకోకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బాధ్యతారాహిత్యం వల్లే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాదాపు 3లక్షలకు పైగా కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని… 2019 ఓటర్ జాబితాతోనే ఎన్నికలకు వెళ్తున్నామన్నారు.
తాను రాజ్యంగబద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నానని, కోర్టు చెప్పిన అంశాల పరిధిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నానన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఎన్నికల షెడ్యూల్ ఆపాలని ప్రభుత్వం కోరటం సరికాదని… సుప్రీం ఎలాంటి తీర్పునిచ్చినా పాటిస్తానని నిమ్మగడ్డ ప్రకటించారు.
అయితే, పంచాయితీరాజ్ ఎన్నికల అధికారులకు నిమ్మగడ్డ ఇచ్చిన హెచ్చరికలు… అందరి ఉద్యోగులకు వర్తిస్తాయని భావించాల్సి ఉన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.