హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కొహినూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో నిన్న ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. కంపెనీ ఆర్థిక లావాదేవీల వివరాలను నిన్న సేకరించారు.
అకౌంటెంట్లను పిలిచి లాగ్ బుక్స్ ను పరిశీలించారు. పలు కంప్యూటర్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరిన్ని వివరాల కోసం ఈ రోజు మరోసారి ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. మరో వైపు క్రిస్టల్ మెన్షన్‌కు చెందిన మజీద్ ఖాన్ నివాసంలో ఈ రోజు ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
దీంతో పాటు కింగ్స్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ ఈ రోజు అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పాటు ఢిల్లీ, కర్ణాటక, నోయిడాలోని పలు ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తం 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక నిన్న కూడా నగరంలోని రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 30 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు.