తెలంగాణలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రముఖ సంస్థల్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు పక్కా ప్రణాళికతోనే అన్నీ ఆరా తీస్తున్నారు. సోమవారం సాయంత్రానికే అకౌంటెంట్లు, హార్డ్‌వేర్ నిపుణులతో 50కిపైగా ప్రత్యేక బృందాలను సిద్ధం చేసుకున్నారు. భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ సాయం కూడా తీసుకున్నారు.
మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఇల్లు, రాజపుష్ప, వసుధ, వర్టెక్స్, ముప్ప సంస్థలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు.. ఇవాళ మరిన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. దాదాపు 50 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.
వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపై ఐటీ ఎప్పటి నుంచో గురి పెట్టింది. కోకాపేట భూముల కొనుగోళ్ల వ్యవహారంతోనే చిట్టా అందింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాడులు ఉంటాయని అనుకున్నా.. ఆ తర్వాత ఆయన కూతురు పెండ్లి సమయంలో నిఘా ఉంచారు అధికారులు. ఆ పెండ్లి నాడే దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రావడంతో బిక్కుబిక్కుమని పెళ్లి జరిపించారని విశ్వసనీయ సమాచారం. ఆ కంపెనీ దాఖలు చేసిన జీఎస్టీ ఫైల్స్ తో ఇన్నాళ్లు కుస్తీ పట్టి ఆధారాలతో సహా దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సోదరుడు జయచంద్రారెడ్డి పరుపాటి, శ్రీనివాస్ రెడ్డి , మహేందర్ రెడ్డి, చరణ్ రాజ్ రెడ్డి, సుజిత్ రెడ్డిల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వీరి కుటుంబ సభ్యులకు చెందిన రాజ్ పుష్ప ప్రైమ్స్, రాజ్ పుష్ప సిమెంట్స్ లిమిటెడ్, రాజ్ పుష్ప ట్రస్ట్ నెస్ట్ రియాల్టీ, రాజ్ పుష్ప ఎస్టేట్, రాజ్ పుష్ప కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్, రాజ్ పుష్ప అసెట్ మెనేజ్మెంట్ ఎల్ఎల్పీ, రాజ్ పుష్ప లాండ్ మార్క్, ఇలా అన్ని కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.