తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య… గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అటు మండలిలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , గంగాధర్ గౌడ్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. నిన్న అసెంబ్లీ గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో కొంత ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రస్తావన లేకుండానే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని యథాతథంగా చదివి వినిపించారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రశాంతంగా ముగియడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో…. బీఏసీ లో తీసుకున్న నిర్ణయాలను సీఎం ముందుకు మంత్రులు తీసుకురానున్నారు.
పెండింగ్‌లో ఉన్నవాటిని టేబుల్ అంశాలుగా పెట్టనున్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ టేబుల్ ఐటమ్‌గా పెట్టనున్నారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. డ్రికింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కు సంబంధించి వార్షిక నివేదికను మంత్రి ఎర్రబెల్లి టేబుల్ ఐటమ్‌గా పెట్టనున్నారు.
కాగా… అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగించాలని నిన్నటి బీఏసీలో కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఎంఐఎం పట్టుబడుతోంది. దీంతో సమావేశాల కొనసాగింపుపై 8న నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేశారు. అయితే బీఏసీ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత (Police heavy security)ను ఏర్పాటు చేశారు. సుమారు 2వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను కల్పించారు. 792 సివిల్ పోలీస్, 20 మెన్ ప్లాటూన్స్(ఒక్కో ప్లాటున్‌లో 21 మంది), 4 విమెన్ ప్లాటూన్స్, టాస్క్ ఫోర్స్, సిసీఎస్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.