రష్యా, ఉక్రెయిన్ దేశాలు పోటాపోటీగా బాంబులు ఎలా వేసుకుంటున్నాయో.. స్టేట్ మెంట్స్ కూడా అదే రేంజ్ లో ఇస్తున్నాయి. తాజాగా పౌరుల తరలింపు కోసం మానవతా కారిడార్ ను తెరుస్తున్నట్లు రష్యా ప్రకటించగా.. ప్రజలు తరలివెళ్లేందుకు పుతిన్ సైన్యం అవకాశం లేకుండా చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
పౌరుల తరలింపునకు రష్యా అడుగడుగునా అడ్డుపడుతోందని జెలెన్‌స్కీ విమర్శించారు. అమాయక ప్రజలను ఆపడానికి రష్యా ట్యాంకులు, రాకెట్ లాంచర్లు ఉపయోగిస్తోందన్నారు.
ఇప్పటిదాకా 11వేల మందికి పైగా రష్యా సైన్యాన్ని హతమార్చినట్లు తెలిపింది ఉక్రెయిన్. అయితే.. రష్యా మాత్రం 500 మందే అని చెబుతోంది. కానీ.. ఇరు దేశాలు.. ఉక్రెయిన్ లో ఎంతమంది చనిపోయారో మాత్రం వెల్లడించలేదు.
ఉక్రెయిన్ బలగాలు రష్యన్ సేనలకు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో రష్యా మేజర్ జనరల్ విటాలి గెరాసిమోవ్ మృతి చెందారు. ఖార్కివ్ సమీపంలో జరిగిన దాడుల్లో విటాలి మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈయన రష్యా 41వ సైన్యానికి చెందిన మొదటి డిప్యూటీ కమాండర్ మేజర్ జనరల్.
ఇటు ఉక్రెయిన్ లోని ప్రముఖ నగరాలపై రష్యా దాడిని ఉధృతం చేసింది. తూర్పున ఖార్కివ్, ఈశాన్యంలో సుమీ, రాజధాని కైవ్ సమీపంలోని గోస్టోమెల్, నైరుతిలో మైకోలైవ్ నగరాలను నామరూపాలు లేకుండా చేసింది.