స్వాతంత్య్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర ఎనలేనిది. ఆయన చేసిన పోరాటానికి బయపడే బ్రిటీషర్లు దేశాన్ని విడిచివెళ్లారని కొందరు వాదిస్తారు కూడా. ఓ వైపు గాంధీజీ అహింసా మార్గాన్ని ఎంచుకుంటే.. నేతాజీ మాత్రం రక్తం చిందిస్తే కానీ.. స్వేచ్ఛ లభించదని గట్టిగా నమ్మాడు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీతో చేతులు కలిపిన బోస్ బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాడాడు. ఓటమి అంచుల వరుకు వెళ్లిన ఇంగ్లాండ్.. భారీ నష్టాన్ని చెల్లించుకుంది. దీంతో.. భారత్ లో ఉద్యమాలను ఎదుర్కొని పాలించడం తమ వల్లకాని పని అని బ్రిటిష్ దేశాన్ని వదిలి పోయింది అనేది పలువురి వాదన. అందులో ఎంత నిజం ఉన్నా.. తెల్లదొరల కాలి కింద నేల కదిలేలా బోస్ చేశాడు అనేది వాస్తవం. నేతాజీ అంటే ఎంత సంచలనమో.. ఆయన మరణం కూడా అంతే మిస్టరీగా మిగిలిపోయింది.
ఆయన మృతి పట్ల చాలా ఊహాగనాలు వచ్చాయి. కానీ.. ఏది నిజమో మన ప్రభుత్వం తేల్చలేదు. దీనిపై బోస్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా కేంద్రం ప్రకటించిన భారతరత్న కూడా తిరస్కరించారు. టోక్యోలోని రెంకోజీ మందిరంలో బోస్ అస్థికలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటికి డీఎన్ఎ టెస్టులు జరిపి ఉంటే నేతాజీ మరణంపై ఉన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పడి ఉండేది. కానీ.. ఎందుకు ప్రభుత్వం ఆ పని చేయలేదో అనేది మరో మిస్టరీగా మారిందని నేతాజీ సోదరుడు శరత్ చంద్రబోస్ మనవరాలు మాధురీ బోస్ అంటున్నారు.
అస్థికలకు డీఎన్‌ఏ పరీక్షలు చేసేందుకు రెంకోజీ పూజారి అనుమతిచ్చారని ఆమె చెబుతున్నారు. దానికి సంబంధించి ఆ మందిర అధికారులు భారత ప్రభుత్వానికి 2005లో ఓ లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. అప్పటికే బోస్ కి సంబంధంచిన మిస్టరీని ఛేదించడానికి ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ ఏర్పాటు చేసింది. రెంకోజీ పూజారి నుంచి వచ్చిన లేఖను అనువాదం చేయకుండా.. ఈ కమిషన్ ప్రభుత్వానికి 2006 లో ఓ నివేదిక అందించిందని మాధురీ బోస్ ఆరోపిస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల విషయంలో రెంకోజీ ఆలయ అధికారులు మౌనం వహించడంతో తాము ముందుకు వెళ్లలేకపోయామని కమిషన్ పేర్కొందని తెలిపారు.
అయితే.. జపాన్ భాషలో ఉన్న పూజారి లేఖను తాము అనువాదం చేస్తే.. అందులో డీఎన్‌ఏ పరీక్షలకు అనుమతిచ్చినట్లు ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎందుకు అలా అబద్దం చెప్పాల్సివచ్చిందో అర్థం కావటంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని ముఖర్జీ కమిషన్ తన నివేదికలో తెలిపింది. దీంతో నేతాజీ అదృశ్యంపై పలు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, సన్యాసిగా తిరుగుతున్నాడని, రష్యా ప్రభుత్వం బోస్ ని జైల్లో నిర్బంధించిందని.. ఇలా రకరకాల ఊహాగానాలు బయటకి వచ్చాయి. కానీ.. ఏదీ నిజం అనేది ఇప్పటికీ తేలలేదు.