తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్,బీఆర్ఎస్ పార్టీపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన సాగుతోందని కేఏ పాల్ మండిపడ్డారు. దళితుల ఓట్లు సంపాదించుకునేందుకే సీఎం కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారని విమర్శించారు. సచివాలయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున మాత్రమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆయన పేరు పెట్టి నూతన సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజు నాడు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
కేసీఆర్ బర్త్ డే నాడు ప్రారంభిస్తే..సచివాలయానికి కేసీఆర్ భవన్ అని పేరు పెట్టవచ్చు కదా అని తెలిపారు. సీఎం కేసీఆర్ తనను తాను జాతిపిత అని చెప్పుకుంటూ తన పుట్టిన రోజున ప్రారంభించాలని చూస్తున్నారని మండి పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా అంబేద్కర్ జయంతి రోజునే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ఉంటే కేసీఆర్ నూతన సచివాలయం నిర్మించారని దుయ్యబట్టారు. ఫిబ్రవరి 17నే సచివాలయం ప్రారంభిస్తే అంబేద్కర్ అనుచరులు సచివాలయ ముట్టడికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వం తీరు మారదని ఘాటుగా విమర్శించారు పాల్.