గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు ముందుచూపుతో చేసిన సిల్లీ పని.. చివరికి ఓటమి పాలు చేసింది. బీఎన్‌రెడ్డి నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ ప్రసన్నను గెలిపించేందుకు ఆమె కుమారుడు రంజిత్ గౌడ్ అహర్నిశలు కష్టపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓటమికి పరోక్షంగా తానే కారణమయ్యాడు.
సిట్టింగ్ కార్పొరేటర్ అయిన లక్ష్మీ ప్రసన్న టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేయగా.. ఆమె తరపున డమ్మీ అభ్యర్థిగా కుమారుడు రంజిత్‌గౌడ్ కూడా నామినేషన్ దాఖలు చేశాడు. తాను అభ్యర్థిగా ఉంటే రిజల్ట్ రోజు స్వయంగా ఓట్ల లెక్కింపును పర్యవేక్షించొచ్చన్న ఆలోచనతో నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. అనుకున్నట్టే ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి స్వయంగా తన తల్లికి పడ్డ ఓట్ల లెక్కింపులో పాల్గొన్నాడు. కానీ తానొకటి తలిస్తే ఓటర్లు మరొకటి తలిచారు.
లక్ష్మీప్రసన్నకు 11 వేల 406 ఓట్లు పడ్డాయి. కానీ 32 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి లచ్చిరెడ్డిపై ఆమె ఓడిపోయారు. ఇదే సమయంలో డమ్మీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె కుమారుడు రంజిత్‌గౌడ్ టార్చిలైట్ గుర్తుకు 39 ఓట్లుపడ్డాయి. తల్లీకొడుకుల్లో ఎవరికి ఓటు వేసినా ఒక్కటే అన్న భావనలో కొందరు టార్చిలైట్‌కు ఓటేశారు. దురదృష్టవశాత్తూ సరిగ్గా అవే ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు.