చైనాతో మొదలై ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ పంజా ఇప్పుడు తెలంగాణపై పడుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరటంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. ముఖ్యంగా కరీంనగర్‌కు చెందిన వారికి కరోనా పాజిటివ్ రావటం, వారు జిల్లాలో ప్రయాణించటంతో… కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో వారంతా ఎవరెవరని కలిశారో జల్లెడపడుతుంది.
కరోనా వైరస్‌కు అడ్డుకట్ల వేసేందుకు ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలు, పార్క్‌లు, పబ్‌లు ఇలా అన్నింటికి నెలాఖరు వరకు సెలవు ఇవ్వగా ఇప్పుడు జనం గుంపులు గుంపులుగా ఉండకుండా చర్యలు చేపట్టనుంది. అవసరమైతే హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ముఖ్యమైన నగరాల్లో 144 సెక్షన్ పెట్టాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి ఈ ఆంక్షలను సడటించటం కానీ మరింత పటిష్టం చేయటం కానీ చేసే అవకాశం ఉంది. సీఎంతో జరగుతున్న కలెక్టర్లు, పోలీసు అధికారుల మీటింగ్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు తెలంగాణ సచివాలయంలోకి సామాన్య జనాలు రాకుండా ఇప్పటికే ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జిల్లాల నుండి జనం రాకుండా ఉండేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయ వర్గాలు ప్రకటించాయి.