లోకో పైలెట్ వాసవి మిస్సింగ్ మిస్టరీగా మారింది. 50 రోజులైనా ఇంకా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఈ కేసు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్, డెబిట్ కార్డులు అన్నీ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన గత ఏడాది నవంబర్ 30న జరగగా.. ఇప్పటివరకు లోకో పైలెట్ మిస్సింగ్ ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి సుమారు 50 రోజులు కావస్తున్న తన కూతురు జాడ లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి ప్రభ.. సనత్ నగర్ లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటుంది. అయితే ఎప్పటిలాగే గత ఏడాది నవంబర్ 30న సికింద్రాబాద్ వెలుతున్నానని వెళ్లింది. ఆమె తండ్రి భాస్కర్ రావు వాసవీకి సాయంత్రం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో వాసవి అద్దె ఇంటి యజమానికి ఫోన్ చేయగా.. వాసవి బయటకు వెళ్లిందని చెప్పి వెళ్లిందన్నారు. అయితే ఆ తర్వాత కూడా వాసవికి తండ్రి చాలా సార్లు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు.
అయితే వెంటనే వాసవి తల్లిదండ్రులు అర్థరాత్రి ఇంటికి వెళ్లారు. యజమాని సాయంతో తాళం తెరిచి చూడగా.. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వాసవికి ఈ మధ్య పెళ్లి నిశ్చయం అయిందన్నారు తల్లిదండ్రులు. ఒకవేళ పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో గొడవ పడినట్టు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే.. తనకి నచ్చిన వ్యక్తితోనే పెళ్లి చేస్తామని, ఎక్కడ ఉన్నా వాసవి క్షేమంగా ఇంటికి రావాలని కోరుతున్నారు.
పోలీసులకు వాసవి మిస్సింగ్ కేసు సవాల్ గా మారింది. వాసవి ఎక్కడైనా కనిపిస్తే.. 94906 171132, 89195 58998 నెంబర్లకు కాల్ చేయాలని కోరారు. వాసవీ ఏమైంది? ఏమైనా అఘాయిత్యానికి పాల్పడిందా? ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందా? ఇన్ని రోజులు వాసవి ఎక్కడ ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుపై సనత్ నగర్ సీఐ ముత్తూ యాదవ్ మాట్లాడుతూ.. అసిస్టెంట్ లోకో పైలెట్ వాసవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఆమె తన వెంట ఎలాంటి కార్డులు, సెల్ ఫోన్ తీసుకెళ్లకపోవడంతో ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందికరంగా మారిందన్నారు. భరత్ నగర్ కు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన సీసీ ఫుటేజ్ ఒకటే ఉందని.. భరత్ నగర్ నుండి సీసీ కెమెరాలు పని చేయడం లేదన్నారు. కాబోయే భర్తను మూడు సార్లు, తోటి ఉద్యోగులను కూడా స్టేషన్ కి పిలిపించి విచారించామన్నారు. తనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే పోలీసులు తెలపాలని తెలిపారు సీఐ ముత్తూ యాదవ్.