సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు నగారా మోగింది. సికింద్రాబాద్‌తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు రక్షణశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్ మిట్టల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో మొత్తం 8 వార్డులున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఏప్రిల్30న ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
అంతకు ముందు 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. 2015 ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువు తీరగా 2020 ఫిబ్రవరి 10తో పాలకవర్గం గడువు తీరింది.
అనంతరం కంటోన్మెంట్ కు నామినేటెడ్ సభ్యుడిని కేంద్రం నియమించింది. దీంతో బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
ఈ క్రమంలో దీనిపై స్పందించాలని కంటోన్మెంట్ బోర్డును కోర్టులు ఆదేశించాయి. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు విధి విధానాలపై కమిటీని నియమిస్తూ కొన్ని రోజుల క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది.