సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంతాపం ప్రకటిస్తున్నాయి.
ఎమ్మెల్యే సాయన్న 1951 మార్చి 5న జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఇప్పటివరకూ ఐదు సార్లు సాయన్న ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుండి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
1994లో టీడీపీ అభ్యర్ధిగా సాయన్న తొలిసారిగా ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాయన్న టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో సాయన్న బాధపడుతున్నారు. దీంతో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆదివారం సాయన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు చికిత్స ప్రారంభించేలోపుగానే సాయన్న మృతి చెందారు.