సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు అధికారులు. ఫస్ట్ ఫ్లోర్ లో పూర్తిగా కాలిన ఓ వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. దుకాణం సిబ్బందిలో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. మంటల సమయంలో ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు.
దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు వెళ్లారని చెబుతున్నారు. దట్టమైన పొగ కారణంగా రెండు రోజులుగా అగ్ని మాపక సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. శనివారం మరోసారి పొగలు ఆర్పివేసి.. లోపలికి వెళ్లి చూడగా.. ఓ వ్యక్తి అస్థి పంజరం లభ్యమైంది. మిగతా ఇద్దరి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు.
కాగా గురువారం సికింద్రాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. 5 అంతస్తుల భవనం, పెంట్ హౌజ్ లో డెక్కన్ నైట్ వేర్ పేరిట క్రీడా సామగ్రి, బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే మంటలు వ్యాపించాయి. సెల్లార్ లోని గోదాంలో పొగలు వ్యాపించాయి. క్రమ క్రమంగా మంటలు చెలరేగాయి.
సమీపంలోని మరో నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఘటనా స్థలంలో 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు మంటలను అధికారులు అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇంతలా కాలిపోయిన భవనాన్ని కూల్చడమే మేలంటున్నారు అధికారులు.