సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్ లో అగ్ని ప్రమాద ఘటన జరిగి నాలుగు రోజులు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఒకరి మృతదేహ అవశేషాలు మాత్రమే లభించాయి. అది కూడా ఎవరిదనే దానిపై స్పష్టత లేదు. మిగతా ఇద్దరి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఏమైనా చిక్కుకుని ఉంటారా? పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కట్టడం బలహీనం కావడంతో స్లాబ్ లు కూలిపోతున్నాయి. గల్లంతైన వారి వివరాలు దొరక్కపోవడం.. స్లాబ్ లు కూలిపోతుండటంతో పోలీసుల్లో, అధికారుల్లో అయోమయం పెరుగుతోంది.
ఇంకోవైపు అక్కడికి చేరుకున్న ముగ్గురి బంధువులు తమ వారి వివరాలు పూర్తిగా తెలిసే వరకు కట్టడాన్ని కూల్చవద్దని వేడుకుంటున్నారు. శనివారం ఒకరి మృతదేహానికి చెందిన అస్థికలు మెట్లకు సమీపంలో లభ్యమవగా, మరో ఇద్దరి ఆచూకీ దొరికిన వెంటనే భవనాన్ని నేలమట్టం చేయాలని అధికారులు భావించారు. కానీ ఇప్పటి వరకూ వారి ఆనవాళ్లు కనిపించలేదు.
ఈ క్రమంలో క్లూస్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది సెల్లార్ లో పలు షట్టర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలోనే మంటలు అధికంగా రావడంతో స్లాబులు కూలిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. షట్టర్లను తొలగించే సమయంలో లోపల నుంచి పొగలు రావడంతో పని ఆపేశారు. వారికి సెల్లార్ లో పొగకు ప్రాణాలను వదిలిన పావురం కనిపించింది. మంటలకు భవనం వెనుక వైపు నాలుగు స్లాబులు కూలి పోయాయి.
కూలిపోయిన స్లాబుల కింద మిగిలిన ఇద్దరి మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శిథిలాలను ఎలా తొలగించాలని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే భవనం వద్ద రాత్రీ, పగలు కష్టపడి పని చేస్తున్న పోలీసు, అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, క్లూస్ టీమ్ లకు సికింద్రాబాద్ ఎమ్మార్వో శైలజ భోజన ఏర్పాట్లు చేశారు. సిబ్బందితో కలిసి స్వయంగా వడ్డించారు.