సికింద్రాబాద్ లోని రామ్ గోపాల్ పేట డెక్కన్ నైట్ వేర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 12 గంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి భవనం పూర్తిగా దెబ్బతింది. మంటలు ఆర్పే క్రమంలో ఏపీఎఫ్ వో ధనుంజయ రెడ్డి, ఫైరింజన్ డ్రైవర్ నర్సింగ రావు అస్వస్థతకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో గురువారం నుంచి ఆచూకీ లభించని ముగ్గురు సజీవదహనం అయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా బూడిదయ్యాయి. మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దంతాలు తప్ప మరేమి దొరికే అవకాశం లేదంటున్నారు అధికారులు. ప్రమాదంలో వసీం, జునైద్, జహీర్ మిస్ అయ్యారు. మృతులు గుజరాత్ కు చెందిన కూలీలుగా అధికారులు గుర్తించారు.
కాగా ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ అమోయ్ కుమార్ పరిస్థితి సమీక్షించారు. బిల్డింగ్ లోపల ఇంకా మంటలు అదుపులోకి రాలేదని ఫైరింజన్ల సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. లోపలి నుంచి పొగ, వేడి వస్తుండటంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారని చెప్పారు. బిల్డింగ్ లోపల డెడ్ బాడీస్ ఉన్నాయో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు కలెక్టర్ అమోయ్ కుమార్.
అలాగే ఈ ప్రమాద ఘటనపై రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఓనర్లకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. బిల్డింగ్ బీమ్ లు పూర్తిగా దెబ్బతిన్నారని నిట్ ప్రొఫెసర్ చెప్పారని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. అగ్ని ప్రమాదం జరగడానికి షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం కాదన్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్ లో ట్రిప్ అయ్యేదన్నారు. కానీ సబ్ స్టేషన్ లో అలా జరగలేదన్నారు. గురువారం ఫోన్ రాగానే భవనానికి విద్యుత్ సరఫరా నిలిపేశామన్నారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, తీగలు పూర్తిగా కాలిపోయేవన్నారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో మీటర్లలో విద్యుత్ సరఫరా ఉందన్నారు.
అయితే డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్స్ అగ్ని ప్రమాదం ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. వారి ఆనవాళ్లు గుర్తించేందుకు ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది విక్టిమ్ లొకేషన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాన్ని బిల్డింగ్ లోకి పంపిన అధికారులు.. దీన్ని ఉపయోగించి శిథిలాల్లో చిక్కుకున్న వ్యక్తులను సైతం కనిపెట్టి, వీఎల్సీ సాయంతో బాధితులతో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. డ్రోన్ల సాయంతో భవనం లోపలి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేసినా బిల్డింగ్ లోపల అంతా చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించడం లేదన్నారు అధికారులు.